మునగ పూలు... మునగ పుష్పాలను కూరగా, వేపుళ్లుగా చేసుకుని చాలామంది భుజిస్తుంటారు. వీటిపుష్పాలను కొంత సేపు నానబెట్టి జలుబు నివారణ ఔషధంగా కూడా వాడతారు. మునగ పుష్పాల రసం మూత్రకోశ, మూత్ర నాళాల సంబంధ సమస్యలను నివారిస్తుంది. మునగపూలలో లభించే టెరినో స్పెర్మిస్ అనే యాంటీ బయోటెక్‌ను ఫంగిసైడల్ సమ్మేళనంతో చర్మంపై ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌ల నివారణ చర్యల్లో వాడుతుంటారు.
మునగ గింజలు... మునగ గింజల్లో ఆలివ్ ఆయిల్‌తో సమానమైన ఓలిక్ ఆమ్లం 75 శాతం దాకా లభిస్తుంది. ఈ ఆయిల్‌ను సబ్బులు, సుగంధ ద్రవ్యాల తయారీలో, వాచ్‌లలో కందెనగా కూడా ఉపయోగిస్తుంటారు. ఈ నూనె పులవదు, వేడి చేసినప్పుడు పొగ ఏర్పడదు.
మురికిగా ఉండే నదీ జలాలను శుభ్రపర్చడానికి వీటి గింజల పౌడరును వాడతారు. నీటిలోని బాక్టీరియాను కూడా ఈ గింజలను ఉపయోగించి తొలగించవచ్చు. అర్థరైటిస్, రుమాటిజం గౌట్ లైంగికంగా సంక్రమించే వ్యాధుల చికిత్సలో మునగ గింజలు ఎంతగానో ఉపకరిస్తాయి. మునగ గింజల కేక్‍లో అధికస్థాయి ప్రొటీన్‌లు ఉంటాయి. కనుక వ్యవసాయంలో మంచి ఎరువుగా ఇది ఉపయోగపడుతుంది.
మునగ జిగురు, బెరడు.... అలాగే మునగ చెట్టు జిగురును క్యాలికో ప్రింటింగులోనూ, ఔషధాల తయారీలోనూ తటస్థకారకంగా ఉపయోగిస్తారు. మునగ కలప గుజ్జునుంచి మంచి న్యూస్ ప్రింట్ కాగితాన్ని తయారు చేయవచ్చు. ఈ గుజ్జును బయోమాస్‌గా కూడా ఉపయోగించవచ్చు. మునగ బెరడు, గమ్‌ను తోలు పరిశ్రమల్లో చర్మాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు.
కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉంటున్న మునగ చెట్టును నిర్లక్ష్యం చేయవద్దు. ఏ నేలలో అయినా సులువుగా పెరిగే మునగ చెట్టును ఇంటి పెరడులో నాటి పెంచుకోగలిగితే మూడు నెలలు అత్యంత పోషకవిలువలను మనం పొందవచ్చు. పైగా మునగాకును సంవత్సరమంతా వాడుకోవచ్చు కూడా. మహిళలకు, పిల్లలకే కాక మనుషులందరికీ బలవర్థమైన ఆహార విలువలను మునగ చెట్టుద్వారా పొందవచ్చు. |