కార్బోహైడ్రేట్లు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలనేది ప్రస్తుతం మంత్రజపమై కూర్చుంది. అయితే ఉదయం పూట తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేలా కనీసం 610 కాలరీల ఆహారం తీసుకోవాలి. నేటి యువతీ యువకుల్లో ఎక్కువమంది 290 కాలరీలకంటే తక్కువ ఆహారం మాత్రమే తీసుకుంటూండటంతో మధ్యాహ్నమయ్యేసరికి ఆకలేసి మరీ ఎక్కువగా తినేస్తున్నారు.
ఒకవేళ మధ్యాహ్నం సరిగ్గా తినకపోతే ఆ వెలితిని శుభ్రంగా రాత్రిపూట నింపేస్తున్నారు. ఇలా రాత్రిపూట కడుపునిండా భోజనం చేసి అలా పడుకున్నారంటే తిన్న ఆహారం అరిగే దారి లేదు కాబట్టి ఒంట్లో కొవ్వు అమాంతంగా పెరిగిపోతుంది.
పోతే... మధ్యాహ్నం 395 కాలరీల ఆహారం, రాత్రిపూట 235 కాలరీల ఆహారం తీసుకుంటే సరిపోతుందని డైటీషియన్లు సెలవిస్తున్నారు. పొద్దుటినుంచి సాయంత్రం వరకు పని చేస్తుంటారు కాబట్టి మధ్యాహ్న భోజనం మాత్రం కాసింత ఎక్కువ మోతాదులోనే ఉండాలని వీరి సూచన. అదే రాత్రి పూట వీలైనంత తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకుని పడుకుంటే పొద్దున లేవగానే ఆకలి కూడా బాగా వేస్తుందని వీరంటున్నారు.
మరి కొందరు ఒళ్లు తగ్గించుకోవాలని ఒంటి పూట భోజనం మాత్రమే చేస్తుండటం కద్దు. అది కూడా మధ్యాహ్నం మానేసి, రాత్రి తిని పడుకుంటుంటారు. దీంతో వారికి తెలియకుండానే ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. ఫలితం మళ్లీ కొవ్వు పేరుకుపోతుంది.
అందుకని మొదట్లో చెప్పిన సామెతను కాస్త మార్చి చెప్పుకుందామా... ఉదయం పూట రాణీలా భోంచేయండి. మధ్యాహ్నం రాజకుమార్తెలా భోంచేయండి. రాత్రి యాచకురాలిలా తినండి. ఇదే మన దేహారోగ్యానికి కనీస ప్రాధమిక సూత్రం మరి.. పాటిస్తారు కదూ.... |