ప్రతిరోజూ ఉద్యోగ భారంతో సతమతమయ్యేవారికి సెలవురోజుల్లో ఏ పనీ లేకపోవడం వల్ల తిండిమీదే ఎక్కువగా ధ్యాస ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు చిరుతిండ్ల పేరుతో స్వీట్లు, కారాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వీటిద్వారా పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు ఏర్పడుతుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సంక్లిష్టంగా ఉండే కార్బోహైడ్రేట్లను తీసుకోవాల్సి ఉంటుంది.
చిరుతిళ్ళే కదా అనుకుంటూ తినటం వల్ల వాటినుంచి శరీరానికి 500 నుంచి 1000 లోపు అదనపు క్యాలరీలు వచ్చి చేరతాయి. తిండి ఎక్కువగా తిన్న రోజుల్లో ట్రెడ్‌మిల్ వ్యాయామం కాస్తంత ఎక్కువగా చేస్తే మరీ మంచిది.
సెలవు రోజుల్లో ప్రశాంతంగా తిని ఉండకుండా ఈ కట్టుబాట్లేంటిరా... అనుకుంటే అధిక బరువును కొనితెచ్చుకోక తప్పదు. కాబట్టి... ఈ రోజుల్లో పూర్తిగా డైట్ చేయమని చెప్పట్లేదు కానీ... పోషక విలువలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకున్నట్లయితే చిరుతిళ్ళ వైపుకు దృష్టి పోదనే విషయాన్ని మాత్రం గమనిస్తే చాలు.
పోషకాహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. నిరంతరం ఉత్సాహంగా ఉండే పనులను చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే సెలవు రోజుల్లో మీ శరీరం అదుపు తప్పకుండా ఉండటమే కాకుండా... చక్కటి ఆకృతితో, ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉంటుంది. కాబట్టి... వీటిని తప్పక పాటిస్తారు కదూ...! |