భారత చరిత్రలో తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి, మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచి... పోలీసు శాఖకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన భారతవనిత కిరణ్ బేడి. సమాజంలో సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన బేడి... 1949, జూన్ 9న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు.
ఆమె తల్లిదండ్రులు బేడి ప్రకాష్ లాల్ పేష్వారియా, ప్రేమ్ లతా పేష్వారియాలు. కిరణ్ ద్వితీయసంతానం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అమృత్‌సర్‌లోనే ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువులను పంజాబ్ యూనివర్శిటీలో పూర్తి చేశారు.
అప్పుడే భారత పోలీసు శాఖపై ఆమె దృష్టి సారించారు. దీని కోసం ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో ఎల్ఎల్‌బీ చేశారు. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడే ఆమెలోని అత్యున్నత ప్రతిభకు యూనివర్శిటీ పురస్కారంతో సత్కరించింది. అప్పట్లోనే మాదకద్రవ్యాలను నిరోధించటం, గృహహింసకు అడ్డుకట్టవేయటం వంటి వాటిపై సిద్ధాంతీకరించి.. పరిశోధన వ్యాసం చేయడం గమనార్హం.
క్రీడలలోను ఆమె ముందడుగే... తన 22 ఏళ్ల వయసులోనే మహిళా విభాగంలో ఆఖిల భారత ఆసియా టెన్నిస్ ఛాంపియన్‌గా టైటిల్ కప్ గెలుచుకున్నారు. 1970-72ల మధ్య అమృత్‌సర్‌లోని ఖాల్సా మహిళా కళాశాలకు రాజనీతిశాస్త్రంలో లెక్చెరర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు తొలి పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణురాలై ఐపీఎస్‌కు ఎంపికై అందరినీ అబ్బురపరిచారు.
|