ప్రపంచ చరిత్ర పుటల్లో తమకంటూ స్థానం ఏర్పరుచుకున్న మహిళ... నేటికీ సరికొత్త సంచలనాలను సృష్టించి మరణాన్ని కూడా జయించి అంతరిక్షంలో కాలుమోపుతోంది. అడుగడుగునా సమాజంలో ఎన్ని అడ్డంకులు వస్తున్నా.. పవిత్రమైన తన లక్ష్యం కోసం అలుపెరగక పోరాడి భారతీయ మహిళగా, స్త్రీ జాతికి ఆదర్శంగా అలసిపోక, ఆగిపోక నిరంతరం శ్రమించి విజయశిఖరాలను అందుకుంది సునీతా విలియమ్స్.
అమెరికా దేశంలోని ఓహియోలోని యుక్లిడ్‌లో 1965, సెప్టెంబర్ 19న జన్మించిన సునీతా విలియమ్స్ మైకేల్ జే.విలియమ్స్‌ను వివాహమాడి ప్రస్తుతం మస్సాచుసెట్స్‌లో స్థిరపడ్డారు. చిన్నప్పటినుంచి అంతరిక్ష యాత్రలు చేయడమంటే ఎంత ఇష్టమో అలాగే.. స్విమ్మింగ్, పరుగుల పందెం, స్నోబోర్డింగ్, విండ్‌సర్ఫింగ్, బైకింగ్, మరియు బో హంటింగ్ అంటే కూడా ఆసక్తి ఎక్కువ.
1983 సంవత్సరంలో మస్సాచుసెట్స, నేథమ్‌లో గల నేథమ్ హైస్కూల్‌లో విద్యను పూర్తి చేసిన సునీతా.. 1987లో యునైటెడ్ స్టేట్స్ నావల్ ఎకాడమి నుంచి భౌతిక శాస్త్రంలో బి.ఎస్. పట్టాను అందుకుని విజయాల పరంపరకు నాంది పలికారు.అనంతరం అందులోనే నావికా దళంలో విమాన చోదకులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
1995లో ఫోర్లిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో ఎమ్.ఎస్. పట్టాను స్వీకరించారు. ఆ తర్వాత అమెరికా ఎయిర్‌ఫోర్సులో ప్రవేశించిన సునీతా.. దాదాపు 30 రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను 2770 గంటల పాటు నడిపిన అపార అనుభవాన్ని తన సొంతం చేసుకున్నారు.
తన కెరీర్‌లో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న సునీతా 1998 జూన్ మాసంలో ఉత్తర అమెరికా అంతరీక్ష పరిశోధన సంస్థ (నాసా)కు ఎంపికయ్యారు. అదే సంవత్సరం ఆగస్టు మాసంలో వ్యోమగామి శిక్షణకై ఆమె హాజరయ్యారు.
|