రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తన పెళ్లిరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు తిరుమల శ్రీవారి అర్చనలో పాల్గొన్నారు. జూలై 7వతేదీ తన పెళ్లిరోజు కావడంతో ఆమె కుటుంబంతో సహా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు.
దర్శనానంతరం పద్మావతి అతిథి గృహంలో కుటుంబంతో కలిసి పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటారు. కాగా సోమవారం తెల్లవారు జామున వేదపండితులు ఆలయ మర్యాదలతో 73 ఏళ్లు నిండిన రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పడి ఇప్పటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా తిరుమలలో నాలుగు రోజులు పాటు జరిగే అమృతోత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ మహద్వారం వద్ద ఎస్వీ భక్తి ఛానెల్‌ను రాష్ట్రపతి నేడు లాంఛనప్రాయంగా ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా ప్రారంభించిన ఈ ఆధ్యాత్మిక భక్తి ఛానెల్ ఈ ఉగాది పర్వదినం నుంచి టెస్ట్ సిగ్నల్స్‌తో నడుస్తుండటం తెలిసిన విషయమే.
|