ప్రధాన పేజి   వార్తలు  కెరీర్  కథనాలు
 
దూరవిద్య ద్వారా ఇంజనీరింగ్ విద్య (ఎఎంఐఇ)
ఇంజనీరింగ్ విద్య చేయాలనుకున్న అభ్యర్దులు ఎంసెట్, ఐఐటి పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించినప్పటకీ ఆర్ధిక కారణాలతో అందులో చేరలేనివారికి ఎఎంఐఇ కోర్సు గొప్ప వరం లాంటిది. ఈ కోర్సు చేయటానికి అభ్యర్ది తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ లేదా పాలిటెక్నిక్‌లో ఏ ట్రేడ్‌లో ఉత్తీర్ణులైనవారు అర్హులు.

ఆ తర్వాత ఎఎంఐఇ సంస్థకు దరఖాస్తు చేసుకుని సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. ఈ కోర్సులో సెక్షన్ -ఎ, సెక్షన్ -బి, సెక్షన్ -సి విభాగాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ విద్యార్దులకు సెక్షన్ -ఎ లో పది సబ్జెక్టులు ఉండగా, డిప్లొమా వారికి నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. సెక్షన్ -ఎ పూర్తి అయిన అనంతరం సెక్షన్ -బికి అర్హత లభిస్తుంది. సభ్యత్వం వచ్చినప్పటినుంచి ఆరు సంవత్సరాల్లోపు సెక్షన్ -ఎ పూర్తిచేయాల్సి ఉంటుంది.

సెక్షన్ -బిలో అభ్యర్దులు వారికి నచ్చిన అంశం (ట్రేడ్) ఎంచుకోవచ్చు. ముఖ్యంగా కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి ఉన్నాయి. సెక్షన్ -ఎ అందరు విద్యార్దులకు ఒకటే. కాగా సెక్షన్ -బిలో స్పెషలైజేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

సెక్షన్ -బిలో తొమ్మిదింటిలో ఐదు సబ్జెక్టులు పూర్తిచేసిన అనంతరం సెక్షన్ -సి (ప్రాజెక్ట్, ల్యాబ్ ఎక్సపెరిమెంట్స్) అర్హత లభిస్తుంది. ప్రతిఏడాది జూన్, డిసెంబరు నెల మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి, సెప్టెంబరు మాసాల్లో పరీక్షా ఫలితాలు వెల్లడి అవుతాయి. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి బీఇ, బీటెక్ విద్యార్దులతో పాటుగా సమాన అవకాశాలు ఉంటాయి.