పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఉదయం 11.15 నిమిషాలకు ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర నరసింహం విడుదల చేశారు. ఫలితాల్లో ఎప్పటిలా బాలికలదే పై చేయిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 1453 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణతను సాధించగా, ఎనిమిది పాఠశాలలు మాత్రం సున్నా శాతం ఉత్తీర్ణతను సాధించాయి.
మొత్తం ఉత్తీర్ణతా శాతం 75.47 శాతంగా ఉంది. ఇది గత ఏడాది కంటే 3.82 శాతం అధికం. వీరిలో బాలుర ఉత్తీర్ణతా శాతం 75.14గాను, బాలికలది 75.84 శాతం గాను ఉంది. ప్రథమ స్థానంలో నిజామాబాద్ జిల్లా 85.17 ఉత్తీర్ణతా శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో అదిలాబాద్ జిల్లా 58 శాతంతో ఉంది.
మిగిలిన జిల్లాలను పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో 85 శాతం, కరీంనగర్ జిల్లాలో 84 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 84 శాతం, కృష్ణ జిల్లాలో 82, ఖ్మమ్మం జిల్లాలో 81 శాతం, గుంటూరు జిల్లాలో 80 శాతం, ప్రకాశం జిల్లాలో 78 శాతం, చిత్తూరు జిల్లాలో 77 శాతం, కడప జిల్లాలో 77 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 77 శాతం, విశాఖపట్నం జిల్లాలో 76 శాతం, వరంగల్ జిల్లాలో 74 శాతం, విజయనగరం జిల్లాలో 74 శాతం, నెల్లూరు జిల్లాలో 74 శాతం, ప్రకాశం జిల్లాలో 73, రంగారెడ్డి జిల్లాలో 72, అనంతపురం జిల్లాలో 79 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 69 శాతం, కర్నూలు జిల్లాలో 68 శాతం, నల్లగొండ జిల్లాలో 59 శాతం, అదిలాబాద్ జిల్లాలో 58 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఈ ఫలితాలను వెబ్‌దునియా తెలుగుతో పాటు వివిధ వెబ్‌సైట్లలో చూడొచ్చు. అలాగే.. ఫోన్ నంబర్లైతే 2222 2222, 1255225 (బీఎస్‌ఎన్ఎల్- జంటనగరాలు), 95 40 2222 2222 లేదా 95 40 1255225, రాష్ట్రంలోని మిగితా ప్రాంతాల వాసులు (సెల్‌వన్ లేదా ఎక్సెల్ 12506, ఎయిర్‌టెల్ వినియోగదారులైతే 52222, 52800 అనే ఫోన్ నంబర్లలో తెలుసుకోవచ్చు.
రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన వారి వివరాలను వెల్లడించలేదు. ఈ ర్యాంకుల వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని భావించడంతో ర్యాంకుల వివరాలను నిలిపివేశారు.
|