ఎడ్యుక్యాంపుకు విభాగానికి చెందిన పర్పిల్ పర్సనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్, విద్యార్థులకు సరికొత్త తరహాలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. తమిళనాడులో ఎంపిక చేసిన కొన్ని కళాశాలల్లో ఈ తరహా శిక్షణను ఇస్తారు. పర్పిల్ శిక్షణ ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందని పర్పిల్ ప్రధానాధికారి అమీత్ బన్సాల్ విలేకరులతో చెప్పారు.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో తమ పర్పిల్ శిక్షణా కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని అమీత్ అన్నారు. ఈ పర్పిల్ శిక్షణ డిగ్రీ ముగించిన విద్యార్థులకు వివిధ విభాగాల్లో ఉద్యోగవకాశాలు కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అమీత్ వెల్లడించారు.
ఇకపోతే... పర్పిల్ శిక్షణ పొందే విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చెందిన సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని అమీత్ అన్నారు. ఇప్పటికే పర్పిల్ కేంద్ర ఏర్పాటుకు తమిళనాడులోని మూడు ఇంజనీరింగ్ కళాశాలలు అంగీకారం తెలిపినట్లు అమీత్ అన్నారు. దీంతో పాటు మరికొన్ని కళాశాలలతోనూ ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని ఆయన వివరించారు.
చెన్నై మినహా, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో విద్యార్థుల శిక్షణ కోసం శాటిలైట్‌తో కూడిన స్టూడియోను పర్పిల్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ స్టూడియో ద్వారా వివిధ విభాగాలకు చెందిన నిపుణులు బోధించే అంశాలను విద్యార్థులు గ్రహించేందుకు వీలుంటుందని అమీత్ వెల్లడించారు.
సాధారణంగా విద్యార్థులు తమ డిగ్రీ కోర్సును పూర్తి చేసిన వెంటనే, తన శాఖకు సంబంధించి ప్రత్యేకు శిక్షణ పొందేందుకు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని అమీత్ గుర్తు చేశారు. ప్రపంచ దేశాలను పీడిస్తోన్న ఆర్థిక మాంద్యం కారణంగా డిగ్రీ ముగించిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించడం లేదని అమీత్ చెప్పారు.
ఒకవేళ ఉపాధి అవకాశం లభించినా పరిచయం లేని రంగంలో మూడు నెలలపాటు శిక్షణ పొందాల్సి వస్తుందని, అయితే పర్పిల్ అందించే శిక్షణ ద్వారా ఈ సమస్య తొలగిపోతుందని చెప్పారు. పర్పిల్ సెంటర్‌తో చేతులు కలిపిన అగ్ర సాఫ్ట్‌వేర్ సంస్థల్లో గల ఉపాధి అవకాశాలను బట్టి విద్యార్థులకు శిక్షణనిస్తామని అమీత్ వెల్లడించారు.
విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించే ఈ పర్పిల్ కోర్సులకు చెల్లింపును ఇంకా నిర్ణయించలేదని, మరికొన్ని కళాశాలలతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ప్రకటిస్తామని అమీత్ తెలిపారు. |