ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » ఇంటర్ విద్యలో భారీ సంస్కరణలు (Intermediate study | huge reforms | Board | Balaramaiah | Admission | Five Years)
ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం భారీ సంస్కరణలు చేసింది. గతంలోలా.. వీలున్నపుడు ఏదో ఒక పేపరు రాసి ఏళ్ల తరబడి చదువుతూ.. ఇంటర్ పాసయ్యే విధానానికి స్వస్తి చెబుతూ.. అడ్మీషన్ తీసుకున్న ఐదేళ్లలోపు తప్పనిసరిగా పరీక్షలన్నీ ఇంటర్ పాస్ కావాలనే కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
ఐదేళ్లలోపు పరీక్షలన్నీ పాస్ కాకపోతే.. అడ్మీషన్ రద్దవుతుందన్నమాట. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుండగా.. గ్రూపును గానీ, ఆప్షనల్ సబ్జెక్ట్ (ద్వితీయ భాష), మీడియంను గానీ మార్చుకునేందుకు కూడా ఇక అనుమతివ్వరు. అలాగే పరీక్షల్లో అందించే.. 24 పేజీల బుక్‌లెట్లోనే జవాబులన్నింటినీ నింపాలి. అదనపు పేజీల బుక్‌ను ఇవ్వడం ఇక జరగదు.
ఇంటర్మీడియట్ బోర్డు.. పరీక్షలకు సంబంధించి ఈ కీలకమైన నిర్ణయాలు చేసింది. ప్రస్తుత అకడెమిక్ నుంచే ఇవి అమలులోకి తెస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి జి. బలరామయ్య విలేకరులతో మాట్లాడుతూ, ఇంటర్ కోర్సు అడ్మీషన్ తీసుకున్న విద్యార్థులు ఐదేళ్లలోపు పరీక్షలన్నీ పాస్ కావాలి. లేదంటే.. మళ్లీ మొదటి నుంచి అన్నీ చదవాల్సి ఉంటుందన్నారు.
అలాగే థియరీ పరీక్షల తరహాలోనే ప్రాక్టికల్స్‌లోను జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకుంటున్న కారణంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు ఓఎంఆర్ షీట్, మెయిన్ ఆన్సర్ షీట్, అడిషనల్ ఆన్సర్ షీట్‌లను ఇచ్చేవారు. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి 24 పేజీల బుక్‌లెట్‌గా ఇస్తారని.. అదనపు ఆన్సర్ షీట్లను ఇక ఇవ్వడం జరగదన్నారు.
ఇది మాత్రం ఈ విద్యా సంవత్సరంలో.. లాంగ్వేజ్ సబ్జెక్టుల పరీక్షలకు మాత్రమే ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. వచ్చే అకడెమిక్ నుంచి అన్ని సబ్జెక్టులకు ఈ విధానం వర్తించేలా చేయనున్నారు.