ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » విదేశీ యూనివర్శిటీలతో ఇబ్బంది లేదు: ఐఐటీ, ఐఐఎమ్ (Foreign universities | India | IIT Guwahati | Prof Gautam Baruah | director | IIM Lucknow | Cabinet | Foreign Educational Institution (Regulation of E)
విదేశాల నుంచి పలు విశ్వవిద్యాలయాలు భారతదేశంలోకి వచ్చేందుకు తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్)లు పేర్కొన్నాయి.
విదేశీ విద్యాసంస్థల బిల్లు (రెగ్యులేషన్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఆపరేషన్) 2010ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతో దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు ప్రవేశించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు మంగళవారం దేశంలోని ఐఐటీ, ఐఐఎమ్ సంస్థలకు చెందిన పలువురు ఆచార్యులు న్యూ ఢిల్లీలో అభిప్రాయపడ్డారు.
ఐఐటీ గౌహాతీ డైరెక్టర్ ప్రొఫెసర్ గౌతమ్ బారువా మాట్లాడుతూ విదేశీ విద్యాసంస్థలు భారత దేశంలోకి రావడం ఎంతో ముదావహమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమైన మార్పుకు నాందిగా ఆయన అభివర్ణించారు. విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలోకి రావడంతో ఐఐటీ, ఐఐఎమ్‌కు చెందిన పలువురు బోధనా సిబ్బంది విదేశీ విశ్వవిద్యాలయాలలో చేరేందుకు సిద్ధమౌతారని ఆయన అన్నారు. కొంతమంది అధ్యాపకులు విదేశీ విశ్వవిద్యాలయాలలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినా, మరికొందరు మాత్రం ఐఐటీ సంస్థల్లోనే ఉండేందుకు ఇష్టపడతారని ఆయన తెలిపారు.
బోధనా సిబ్బందిని ఆకర్షించేందుకు కేవలం డబ్బు మాత్రమే కాదని, డబ్బుతో బోధనా సిబ్బందిని కొనలేరని, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో సహృద్భావ వాతావరణం ఉండాలని, విదేశీ విద్యాసంస్థలలో ఐఐటీ స్టాండర్డ్‌కు తగ్గ సౌకర్యాలు కూడా ఉండాలని ఆయన పేర్కొన్నారు. దేశీయ ఐఐటీ సంస్థలకు ధీటుగా తయారయ్యేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలకు మరికొన్ని సంవత్సరాలు పడుతుందని ఆయన తెలిపారు. విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలోకి అడుగిడిన తర్వాత వాటిలో చేరేందుకు పలువురు అధ్యాపకులు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ అదేమంత పెద్ద ఇబ్బంది కలిగించే అంశం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐఐఎమ్ లక్నో డైరెక్టర్ ప్రొఫెసర్ దేవీ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైందేనన్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయికి తగ్గ విద్యావిధానం భారతీయ విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. దేశంలో పలు విశ్వవిద్యాలయాలు అందిస్తున్న డిగ్రీలు, డిప్లొమాలు విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా అందిస్తే చాలా బాగుంటుందన్నారు.
దీంతో దేశీయ విశ్వవిద్యాలయాలలోను పోటీతత్వం పెరిగి మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు వీలుకలుగుతుందని ఆయన అన్నారు. పైగా ఇక్కడ చదివిన విద్యార్థులకు విదేశాల్లోను ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వారి దేశాలలో ఎలాంటి విద్యా విధానాన్నైతే అమలు చేస్తున్నారో అలాంటి విద్యా విధానాన్నే ఇక్కడ కూడా అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ పెంటాల్ మాట్లాడుతూ భారతదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు ప్రవేశిస్తుండటంతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలోకి రావడంతో దేశీయ విశ్వవిద్యాలయాలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు తమ పనితనాన్ని రూపొందించుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దేశీయ విశ్వవిద్యాలయాలలో తగినంత సిబ్బంది, ప్రభుత్వ సహకారం మెండుగా ఉందని ఆయన అన్నారు. దీంతో భయపడాల్సిన పని లేదని ఆయన తెలిపారు. విదేశీ సంస్థల్లో చేరేందుకు పలువురు అధ్యాపకులు ప్రణాళికలు రూపొందించుకుండటాన్ని ఆయన తప్పుబట్టలేదు. అది వారి వ్యక్తిగతమన్నారు.