ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » ఈ యేడాది వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బీఈడీ అడ్మిషన్లు! (BEd | web counselling | Engineering | Higher education | career)
ఈ యేడాది వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బీఈడీ అడ్మిషన్లు!
ఈ యేడాది బీఈడీ అడ్మిషన్లు పూర్తిగా వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ సెంటర్లకు అభ్యర్థులు వెళ్లకుండానే, ఇంటి నుంచి గానీ, సైబర్ కేఫ్‌ల నుంచి గానీ ఇంటర్నెట్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవడం ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులు ఇచ్చుకునే ఆప్షన్లకు లోబడి సీట్ల కేటాయింపు జరుగుతుందని. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది వరకు ఆన్‌లైన్ పద్ధతిలో బీఈడీ అడ్మిషన్లు నిర్వహించిన విషయం విదితమే. బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా కౌన్సెలింగ్ సెంటర్లకు రావాల్సి ఉండేది. అయితే, ఈ దఫా అడ్మిషన్ల విధానాన్ని ఇంజనీరింగ్ అడ్మిషన్ల తరహాలో చేపట్టాలని ఈ మండలి నిర్ణయించడం మంచి శుభపరిణామంగా విద్యార్థులు చెపుతున్నారు. ఈ కౌన్సెలింగ్‌లో పాలు పంచుకునే అభ్యర్థులు తమ అర్హత పత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే 55 హెల్ప్ సెంటర్లు, ఆయా విశ్వవిద్యాలయాల్లోని సెంటర్లలో తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇదిలావుండగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న 606 బీఈడీ కాలేజీల్లో దాదాపు 65 వేల మేరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. గణితం, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సాంఘిక శాస్త్రం, ఇంగ్లీషు మెథడాలజీల్లో అడ్మిషన్లు జరగనున్నాయి. వచ్చే నెల రెండో తేదీ నుంచి ఈ వెబ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు ఉన్నత విద్యా శాఖా ఏర్పాట్లు చేస్తోంది.