హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ సేవలు అందించే ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ 2010-2011 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారీ నియామకాలను చేపట్టనుంది. ఇందులో బాగంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి సంస్థ కొత్తగా మరో 2000 మంది ఉద్యోగస్తులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ హెచ్‌ఆర్ అండ్ కార్పొరేట్ ఎఫైర్స్ అధ్యక్షుడు బి అశోక్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ సంస్థ కార్యాలయాల్లో 8000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కొత్తగా నియమించే అభ్యర్ధులను సంస్థలోని అన్ని విభాగాలలోను నియమించనున్నామని ఆయన అన్నారు.
ఇటీవల అమెరికా వీసా ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయం తమ కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇన్ఫోటెక్ కార్యాలయాల్లో 780 మంది పని చేస్తున్నారు. కాగా.. వీరిలో 250 మంది ఎల్ 1, హెచ్1-బి వీసాలను కలిగివున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇన్ఫోటెక్ ఇటీవల అమెరికాకు చెందిన వెల్స్‌కోను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వెల్స్‌కోలో 180 మంది పనిచేస్తున్నారు. వీరందరూ అమెరికాకు చెందినవాళ్లేనని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇన్ఫోటెక్.. టెక్నాలజీ సొల్యూషన్స్, ఇంజనీరింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ వంటి సర్వీసులను అందిస్తుంది.