ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » 2010-11లో కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దు! (State | AICTE | New colleges | Admitted | Vacant | Government quota)
వచ్చే యేడాది కొత్త ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వొద్దని అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి కె.పొన్ముడి తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఈయేడాది ఇప్పటి వరకు 471 కళాశాలల్లో 1.5 లక్షల మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినట్టు చెప్పారు.
ప్రభుత్వ కోటా కింద ఇంకా 8,172 సీట్లు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. అడ్మిషన్లు పొందిన 1.5 లక్షల విద్యార్థుల్లో ప్రభుత్వ కోటా కింద 1.12 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇంకా మరో 8,172 సీట్లు ప్రభుత్వ కోటా కింద ఖాళీగా ఉన్నట్టు చెప్పారు. గత యేడాది ఈ సంఖ్య 30 వేలుగా ఉన్నాయని వివరించారు.
ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల సంఖ్య ఈ యేడాది గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. 2005లో 17,990 మంది విద్యార్థులు చేరగా, ఈ యేడాది ఈ సంఖ్య 76,073గా ఉందన్నారు. అలాగే, 2006లో 24,670, 2007లో 34,069, 2008లో 50,589, 2009లో 54,073 మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరినట్టు ఆయన తెలిపారు.