డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ శాఖల్లో ఉద్యోగావకాశాలు ఎదురు చూస్తున్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో దీనికోసం పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సుమారు నాలుగు వందల ఉద్యోగాలకోసం ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా, వాటిలో జనరల్ కేటగరీ కింద 202, ఓబీసీలకు 108, ఎస్సీలకు 60, ఎస్టీలకు 30 పోస్టులు రిజర్వు చేశారు. ఈ పోటోపరీక్ష కోసం 2008 జూన్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థులు 6.6.08 నాటికి 18-27 సంవత్సరాల మధ్య వయసు కలిగి, కనీసం ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలి. దాంతో పాటు గంటకు 8వేల మీటలు నొక్కే సామర్థ్యం కలిగి ఉండాలి.
రాత పరీక్షలతో పాటు కంప్యూటర్‌పై కార్య నిర్వహణ సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారు. జనరల్ నాలెడ్జి, జనరల్ సైన్స్, ఆంగ్ల, గణిత శాస్త్రాల్లో ప్రావీణ్యాల్లో యాభై మార్కుల చొప్పున 200మార్కులకు రెండు గంటల పాటు ఆబ్జెక్టివ్ ప్రాతిపదికన పరీక్ష నిర్వహిస్తారు.
మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖ, తిరుపతి, కర్నాలు, తమిళనాడులో చెన్నై, మదురై, కోయంబుత్తూరు, తిరుచ్చి, తిరునల్వేలిలలో, కర్ణాటకలో బెంగళూరు, మంగళూరు, కేరళలో త్రివేండ్రం, త్రిచూర్, కొచ్చి, కోళిక్కోడులలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
మన రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకోదలచిన వారు రీజనల్ డైరక్టర్ (సదరన్ రీజియన్), స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఈవీకే సంపత్ బిల్డింగ్ రెండో అంతస్తు, కాలేజి రోడ్డు, చెన్నై-600006 చిరునామాకు దరఖాస్తు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
కొన్ని ప్రత్యేక తపాలా కార్యాలయాల్లో లభించే రూ. వంద సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీస్ స్టాంపు అతికించిన దరఖాస్తులను మాత్రమే అంగీకరిస్తారన్నది గమనార్హం. ఇతర వివరాల కోసం మే 3-9 నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పత్రికను చూడవచ్చు.
|