పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఉదయం 11.15 నిమిషాలకు ఈ ఫలితాలను రాష్ట్ర పరీక్షల విభాగం విడుదల చేసింది. ఫలితాల్లో ఎప్పటిలా బాలికలదే పై చేయిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 1453 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణతను సాధించగా, ఎనిమిది పాఠశాలలు మాత్రం సున్నా శాతం ఉత్తీర్ణతను సాధించాయి.
మొత్తం ఉత్తీర్ణతా శాతం 75.47 శాతంగా ఉంది. ఇది గత ఏడాది కంటే 3.82 శాతం అధికం. వీరిలో బాలుర ఉత్తీర్ణతా శాతం 75.14గాను, బాలికలది 75.84 శాతంగా ఉంది. ప్రథమ స్థానంలో నిజామాబాద్ జిల్లా 85.17 ఉత్తీర్ణతా శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో అదిలాబాద్ జిల్లా 58 శాతంతో ఉంది.
ఈ ఫలితాలను www.results.webdunia.comతో పాటు వివిధ వెబ్‌సైట్లలో చూడొచ్చు. అలాగే ఫోన్ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు 2222 2222, 1255225 (జంటనగరాలు), 95 40 2222 2222 లేదా 95 40 1255225, రాష్ట్రంలోని మిగితా ప్రాంతాల వాసులు (సెల్‌వన్ లేదా ఎక్సెల్ 12506, ఎయిర్‌టెల్ వినియోగదారులైతే 52222, 52800 అనే ఫోన్ నంబర్లలో తెలుసుకోవచ్చు.
రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన వారి వివరాలను వెల్లడించలేదు. ఈ ర్యాంకుల వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని భావించడంతో ర్యాంకుల వివరాలను నిలిపివేశారు.
|