ఉద్యానవన పంటలకు ఉద్దేశించిన జాతీయ అధ్యయన కేంద్రాలను (ఎన్ఆర్‌సీ) ప్రాజెక్ట్ డైరక్టరేట్‌లుగా అభివృద్ధిపరిచే ప్రతిపాదనను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పరిశీలిస్తున్నది. ఉద్యానవన పంటల పరిశోధనకు గాను దేశంలో ప్రస్తుతం 12 ఎన్ఆర్‌సీలు పనిచేస్తున్నాయని ఐసీఏఆర్ డిప్యూటీ డైరక్టరేట్ జనరల్ (ఉద్యానవనం) హెచ్‌పీ సింగ్ మీడియాతో అన్నారు.
ఎన్ఆర్‌సీలను ప్రాజెక్ట్ డైరక్టరేట్‌లుగా అభివృద్ధి పరచడం ద్వారా ఎన్ఆర్‌సీల పరిశోధనా పరిధిని పెంచవచ్చునని సింగ్ తెలిపారు. అదే సమయంలో పూలతోటలకై ప్రత్యేక డైరక్టరేట్ ఏర్పాటు అంశం ఐసీఏఆర్ పరిశీలనలో ఉందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,300 కోట్ల కేటాయింపును సాధించిన జాతీయ ఉద్యానవన మిషన్ ద్వారా రైతులలో అవగాహన పెంపొందింపచేసినట్లు ఆయన తెలిపారు.
దేశంలో అరటి పంట ఉత్పాదకత 9 మిలియన్ టన్నుల నుంచి 19 మిలియన్ టన్నులకు పెరిగిందని అన్నారు. 2020 నాటికి అరటి ఉత్పాదకత లక్ష్యాన్ని 25 మిలియన్ టన్నుల చేసుకున్నట్లు సింగ్ పేర్కొన్నారు.
|