భారతదేశపు ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది ఎకాయెకిన 3 శాతానికి పడిపోనుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల అధిపతి మోర్గాన్ స్టాన్లీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రపంచం యావత్తూ మాంద్యంతో తల్లిడిల్లుతున్న నేపధ్యంలో ఆ నీడలు భారత్‌ను పూర్తి స్థాయిలో తాకనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన అధ్యయనం ప్రకారం భారతదేశ ఆర్థికాభివృద్ధి మరింత క్షీణిస్తుందని మోర్గాన్ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భవిష్య ఆర్థిక వృద్ధిరేటుపై తాము జరిపిన అధ్యయనంలో... 2009లో బుల్ రేటు ప్రకారం 5 శాతం ఉంటే.. 2010నాటికి ఇది 7.4శాతానికి చేరుకుంటుందని అంచనా. ఇక బేర్‌ను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు 2009లో వృద్ధి రేటు 3 శాతంగా ఉంటుందని.. 2010నాటికి అది 4.5శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు.
మొత్తమ్మీద సగటు వృద్ధిరేటు 2009లో 4.3%గానూ, 2010లో 6.1%గాను నమోదవుతుంది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో 9శాతం ఉన్న వృద్ధిరేటు ఆర్థిక మాంద్యం ఫలితంగా 7.1శాతం వద్ద నిలదొక్కుకుంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే మూడో త్రైమాసికంలో(అంటే అక్టోబరు-డిసెంబరు) వృద్ధి రేటును 5.3%గా నమోదై ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేసింది.
భారతదేశానికి సంబంధించి వృద్ధిరేటులో హెచ్చుతగ్గులు... ఆర్థిక మాంద్యం, సార్వత్రిక ఎన్నికలు అనే రెండు అంశాలపై ఆధారపడి ఉంటాయని మోర్గాన్ తెలిపారు. ప్రపంచం ఆర్థిక మాంద్యం నుంచి బయటపడినా, మే ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల అవకాశాలున్నట్లయితే వృద్ధిరేటు ఆందోళన కలిగించే రీతిలో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఒకవేళ మైనారిటీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినట్లయితే భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండే అవకాశం ఏమాత్రం లేదని ఆయన పెదవి విరిచారు. |