ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగుల తొలగింపులు, నియామకాల నిలిపివేత, ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో మాంద్యం ప్రభావం భారతదేశంపైనా పడుతోంది.
దేశంలో మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి పెరిగే సూచనలు కనపడుతున్నాయి. దీంతో పలు కార్పోరేట్ కంపెనీల సిబ్బంది వేతనాల్లో దాదాపు 6 నుంచి 8 శాతం పెరిగే సూచనలు కనపడుతున్నాయని అంతర్జాతీయ మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు జీతభత్యాలు పెరిగే సూచనలు మెండుగా కనపడుతున్నాయని దేశీయ వ్యాపార విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మౌళికరంగ పరిశ్రమల సిబ్బంది వేతనాలు 8 నుంచి 12 శాతంమేర వృద్ధి జరిగే సూచనలు కనపడుతున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచం సంక్షోభంతో అతలాకుతలమౌతోన్న నేటి తరుణంలో ఆర్థిక, ఐటీ రంగాలు తీవ్రంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ వేతనాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని దేశీయ ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.
ప్రస్తుతం పలు కంపెనీలు ఖర్చు నియంత్రణ బాట పడుతున్నాయి. అయినా కూడా తమ ఉద్యోగుల పనితీరుపై ప్రత్యేకంగా దృష్టిని సారిస్తున్నాయని, పనితీరు ఆధారంగానే వేతనాల పెంపు ధోరణిని అవలంబిస్తాయని సంస్థ తన నివేదికలో పేర్కొంది.
దేశంలో ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ తరుణంలో పలు కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తూ వేతనాలను పెంచేయోచనలోనున్నట్లు ఆర్థికనిపుణలు అంచనా వేస్తున్నారు.