దేశంలో నకిలీ చీరలు పెరిగిపోతుండటంతో బెనారస్ పట్టు చీరలు, జరీ చీరలకు జిఐ (భౌగోళిక సూచిక) రక్షణ పేటెంట్ హక్కులు లభించింది. కంచి పట్టు చీరలకు కూడా జిఐ సర్టిఫికెట్ లభించనుంది.
జిఐ అనేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ (ఐపిఆర్) అనే పేటెంట్‌కు సూచిక. ఒక నిర్దుష్ట ప్రాంతానికి చెందిన ఒక ఉత్పత్తికి ఇచ్చే గుర్తింపు ఇది. సదరు ఉత్పత్తి నిర్దిష్ట నాణ్యత లేదా దాని భౌగోళిక ప్రాశస్త్యాన్నిసూచించి ఏదేని లక్షణాన్ని బట్టి జిఐ సర్టిఫికెట్‌ను ఇస్తారు.
ప్రస్తుతం దేశీయ పట్టు చీరల ఉత్పత్తికి ప్రధానంగా సాంప్రదాయక బెనారసీ చీరలకు ఐక్యరాజ్య సమితి వ్యాపారాభివృద్ధి సంస్థ (అంక్టాడ్) మద్దతుతో జిఐ సర్టిఫికెట్ లభించింది. దీని వల్ల ఇతర ప్రాంతాలు, దేశాలలో తయారై ఇండియాలో అమ్ముడుపోయే చీరల నుంచి ముప్పును చట్టపరంగా అధిగమించేందుకు నేత కార్మికులకు వీలు కలుగుతుంది.
ఈ సర్టిఫికేషన్ కారణంగా కేవలం చీరలకే కాకుండా పట్టు జరీ, డ్రస్ మెటీరియల్, దుప్పట్లు, టేబుల్ కవర్లవంటి తత్సంబంధిత ఉత్పత్తులకు కూడా వర్తిస్తుంది. అంటే ఉత్తర ప్రదేశ్‌లో గుర్తించిన ఆరు జిల్లాలకు వెలుపల తయారైన ఏ చీరనైనా లేదా పట్టు జరీనైనా బెనారస్ చీర, జరీ పేరిట అక్రమంగా విక్రయించరాదు.
జిఐ సర్టిఫికేషన్ పరిధిలోకి వచ్చే జిల్లాలు వారణాసి, ఆజమ్ గఢ్, చందౌలి, జాన్ పూర్, మీర్జాపూర్, సంత్ రవిదాస్ నగర్ - భాదోహి. దాదాపు ఒక నెల వ్యవధిలో వినియోగదారులు జిఐ లేబుల్ సాయంతో ఒరిజినల్ కంచి పట్టు చీరను తేలికగా గుర్తించగలుగుతారు. 21 సహకార సంస్థలు, పది ప్రైవేట్ వర్తక సంస్థలు ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం.