ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » కథనాలు » కొత్త ఆదాయపు పన్ను బిల్లు: రూ.41,040లు ఆదా..!! (Tax Payers | Tax Savings | The Direct Tax Code Bill | Income Tax)
దేశంలో పన్ను చట్టాలను సరళీకృతం చేయడానికి రూపొందించిన ప్రత్యక్ష పన్నుల కోడ్ (డిటిసి) బిల్లును ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన డిటిసి బిల్లు 2012 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ బిల్లు అమలులోకి వస్తే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి రూ.41,040లను ఆదా చేసుకోవచ్చు.
ఈ బిల్లులో వ్యక్తిగత ఆదాయ పరిమితిని రెండు లక్షల రూపాయలకు పెంచింది. అంటే వార్షిక ఆదాయం రెండుల లక్షలోపు ఉన్న వారు పన్ను విధింపు నుంచి మినహాయింపబడతారు. అలాగే వయోవృద్ధులకు మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షల వరకు ఉంటుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను శ్లాబులు: * రూ. 1,60,000లోపు వ్యక్తిగత ఆదాయం ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. * రూ. 2,40,000లోపు ఆదాయం ఉన్న వయోవృద్ధులకు పన్ను మినహాయింపు ఉంటుంది. * రూ. 1,60,000 నుంచి రూ. 5,00,000ల మధ్య ఆదాయం ఉంటే 10శాతం పన్ను విధింపు ఉంటుంది. * రూ. 5,00,000 నుంచి రూ. 8,00,000ల మధ్య ఆదాయం ఉంటే 20శాతం పన్ను విధింపు ఉంటుంది. * రూ. 8,00,000లకు పైగా ఆదాయం ఉంటే 30శాతం పన్ను విధింపు ఉంటుంది.
ప్రతిపాదిత ఆదాయపు పన్ను శ్లాబులు(డిటిసి బిల్): * రూ. 2,00,000లోపు వ్యక్తిగత ఆదాయం ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. * రూ. 2,50,000లోపు ఆదాయం ఉన్న వయోవృద్ధులకు మినహాయింపు ఉంటుంది. * రూ. 2,00,000 నుంచి రూ. 5,00,000ల మధ్య ఆదాయం ఉంటే 10శాతం పన్ను విధింపు ఉంటుంది. * రూ. 5,00,000 నుంచి రూ. 10,00,000ల మధ్య ఆదాయం ఉంటే 20శాతం పన్ను విధింపు ఉంటుంది. * రూ. 10,00,000లకు పైగా ఆదాయం ఉంటే 20శాతం పన్ను విధింపు ఉంటుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను శ్లాబులతో పోలిస్తే ప్రతిపాదిత ఆదాయపు పన్ను శ్లాబుల ప్రకారం రూ.10 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి రూ.41,040లు ఆదా అవుతుంది. అలాగే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి రూ. 21,540, రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి రూ. 7,660లు ఆదా అవుతుంది. ఈ ప్రతిపాదిత బిల్లులో పొదుపుపై పన్ను మినహాయింపుతో పాటు గృహరుణంపై రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు యధావిధిగా కొనసాగుతుంది.