స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 518 పాయింట్లు పుంజుకుని 13,630 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 145 పాయింట్లు పెరిగి 4,092 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 123 పాయింట్ల వృద్ధితో 13,235 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది.
ఉదయం జరిగిన ట్రేడింగ్‌లలో ఆశించిన స్థాయిలో మార్కెట్ లాభాలను గడించింది. ఒకానొక దశలో ఇండెక్స్ సూచీ రెడ్ మార్కు వైపు మళ్లినప్పటికీ చివరి ట్రేడింగ్‌లలో సానుకూలంగా స్పందించి మళ్లీ పుంజుకుంది. బ్యాంకింగ్, చమురు మరియు రియాల్టీ స్టాకుల భారీ అమ్మకాలు, కొనుగోళ్లతో ఇండెక్స్ సూచీ ఒకానొక దశలో 591 పాయింట్లు బలపడి 13,684 వద్దకు చేరింది.
బ్యాంకింగ్ రంగం 8 శాతం వృద్ధి చెందగా, రియాల్టీ ఇండెక్స్ 5.5 శాతం మెరుగుపడింది. అలాగే చమురు 4.3శాతం మేర పుంజుకుంది.
లాభపడ్డ కంపెనీలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, జైప్రకాశ్ అసోసియేట్స్, డీఎల్‌ఎఫ్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, భారతి ఎయిర్‌టెల్, బీహెచ్ఈఎల్, ఐటీసీ, ఎన్టీపీసీ, రిలయన్స్, ఓఎన్జీసీ, ఎల్అండ్‌టీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, మారుతీ, టాటా మోటార్స్, టీసీఎస్, హిండాల్కో తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనించాయి.
నష్టాలను చవిచూసిన కంపెనీలు సత్యం, విప్రో, రాన్‌బాక్సీ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.
|