స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 215 పాయింట్లు బలపడి 13,850 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 4,159 వద్ద ముగిసింది. ఉదయం తాజాగా జరిగిన అమ్మకాల్లో ఇండెక్స్ బాగా లాభపడింది.
అయితే పార్లమెంటులో ప్రభుత్వానికి విశ్వాస తీర్మాన పరీక్ష నేపధ్యంలో ఇండెక్స్ సూచీ పుంజుకోవడం మందగించింది. దీంతో ఉదయం 147 పాయింట్లు లాభంతో 13,782 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక దశలో ఇండెక్స్ సూచీ 13,581కి పడిపోయింది. అయితే బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల స్టాకుల కొనుగోళ్లతో సెన్సెక్స్ రికవరీ అయ్యింది.
ఈ రోజు జరిగిన ట్రేడింగ్‌లలో సెన్సెక్స్ ఒకానొక దశలో గరిష్టంగా 298 పాయింట్లు లాభపడి 13,879 వద్దకు చేరింది. చివరికి సానుకూలంగా స్పందించిన సెన్సెక్స్ 215 పాయింట్లు లాభంలో 13,850 వద్ద ముగిసింది. దీంతో సోమవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,616 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా... 1,363 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 1,169 కంపెనీల వాటాలు లాభపడగా... మిగిలిన కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి.
లాభపడ్డ కంపెనీలు సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రాన్‌బాక్సీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, హిందుస్థాన్ యునిలివర్, జైప్రకాశ్ అసోసియేట్స్, ఎస్‌బీఐ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టీసీఎస్, విప్రో, రిలయన్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, డీఎల్ఎఫ్, ఓఎన్‌జీసీ తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.
నష్టాలను చవిచూసిన కంపెనీలు సత్యం, అంబుజా సిమెంట్స్, బీహెచ్ఈఎల్, ఎల్అండ్‌టీ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.
|