బాంబు పేలుళ్లతో ముంబైలో తీవ్రవాదులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్‌కు గురువారం సెలవు ప్రకటించారు. అనంతరం వారాంతమైన శుక్రవారం కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది.
ఇదే ఊపులో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన ఒక గంటలోపే స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుని 184 పాయింట్ల మేర లాభపడింది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 9277 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 69 పాయింట్లు బలపడి 2824 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
బాంబు పేలుళ్లు స్టాక్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపబోవని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనించడం మదుపుదారులకు కాస్త ఊరట కలిగించింది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో యునిటెక్ లిమిటెడ్, జై ప్రకాష్ అసోసియేషన్, ఎంఫాసిస్ లిమిటెడ్, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ల్యాంకో ఇన్ఫ్రాటెక్ వంటి సంస్థలుండగా, స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్, జిటిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శ్రీరామ్ ట్రాన్స్, ఈఐహెచ్ లిమిటెడ్, పాట్ని కంప్యూటర్స్ సిస్టమ్స్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |