బాంబే స్టాక్ మార్కెట్‌పై కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రభావం పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే, సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మార్కెట్ మందకొడిగా ముందుకు సాగుతోంది.
అయితే నిఫ్టీ 4250-4600 పాయింట్ల మధ్య ర్యాలీని కొనసాగించే అవకాశముందని స్టాక్ మార్కెట్ నిపుణుడు నిలేష్ షా అన్నారు. అంతేగాకుండా.. బడ్జెట్ ప్రభావంతో విద్య, ఆర్థిక, ఇన్సూరెన్స్ సెక్టార్ల లాభాలు పుంజుకునే అవకాశముండటంతో మదుపుదారులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
అయితే గురువారం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి, 14,540 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14పాయింట్ల స్వల్ప నష్టంతో 4,326 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. హింద్ కాపర్, జిఎఐఎల్ ఇండియా లిమిటెడ్, తులిప్ టెలికాం లిమిటెడ్, ఓఎన్‌జీసీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు లాభాలను ఆర్జించాయి. అయితే ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అరెవా, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |