వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంది. కేంద్రప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నిలకడగా కొనసాగుతోంది.
మరోవైపు శుక్రవారం రైల్వేబడ్జెట్ ప్రకటించనున్న కారణంతో స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించే అవకాశముందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అమెరికా మార్కెట్లు కుప్పకూలడం, ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ నత్తనడకన నడుస్తోంది.
దీంతో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. 35 పాయింట్లు క్షీణించి, 14,623 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 4,348 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. హింద్ కాపర్, కంటైనర్ కార్పొరేషన్, బజాజ్ హోల్డింగ్స్, గ్లెమార్క్ పార్మా, రాన్‌బాక్సీ వంటి సంస్థలుండగా, గుజ్ మినరల్ దేవ్, ఎడ్యుక్యాంప్ సొల్యూషన్స్, టొరెంట్ పవర్ లిమిటెడ్, సీసా, కెయిర్న్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |