పుంజుకున్న స్టాక్ మార్కెట్: లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
సోమవారం స్టాక్ మార్కెట్ నిపుణులు ఊహించినట్లే బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకుంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు, గంట తర్వాత స్వల్ప నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటలకు 55 పాయింట్ల మేర లాభపడి, 16, 865 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఐదు పాయింట్ల స్వల్ప లాభంతో 5వేల మార్కు వద్ద పయనిస్తోంది.
ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాలను నమోదు చేసుకోవడం మరియు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానంపై మంగళవారం జరుగనున్న సమీక్షా సమావేశం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ట్రేడింగ్ పూర్తయ్యేలోపు బాంబే స్టాక్ మార్కెట్ లాభాల దిశగా పయనించే అవకాశముందని వారు చెబుతున్నారు.