కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ హామీతో స్టాక్ మార్కెట్ నేడు లాభాలతో ప్రారంభమైంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 15,509 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకుని 4,605 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.68 శాతం, నిఫ్టీ 0.90 శాతం మేరకు వృద్ధి చెందాయి.
ఆసియా మార్కెట్ల నుంచి సైతం సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్ ఈ రోజు ఉదయం 197 పాయింట్లు బలపడి 15,602 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా 58 పాయింట్ల పెరిగి 4,622 వద్ద ప్రారంభమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే దాకా ఉద్దీపనలు కొనసాగిస్తామన్న ప్రణబ్ హామీతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు తెగబడ్డారు. దీంతో ఆరంభమే ఇండెక్స్ బలంగా పుంజుకుంది.
ఇప్పటి వరకు జరిగిన ట్రేడింగ్‌లో హిండాల్కో అత్యధిక లాభాలు దిశగా పయనిస్తోంది. ఇంకా రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, డీఎల్ఎఫ్, స్టెరిలైట్, టీసీఎస్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉండగా.. టాటా పవర్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర సంస్థల వాటాలు బలపడ్డాయి.
ఇప్పటి వరకు మొత్తం 1,215 కంపెనీల స్టాకులు ట్రేడ్ అవగా, 964 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 229 కంపెనీల వాటాలు నష్టపోయాయి.