స్టాక్ మార్కెట్ కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ అయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 139 పాయింట్లు పుంజుకుని 16,203 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 4,806 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.80 శాతం, నిఫ్టీ 0.84 శాతం మేరకు వృద్ధి చెందాయి.
ఈ రోజు ఉదయం ప్రారంభ ట్రేడ్‌లో గరిష్టంగా సెన్సెక్స్ పుంజుకున్న విషయం తెలిసిందే. ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ గరిష్ఠంగా 220 పాయింట్లు లాభపడి 16,284 వద్దకు చేరుకుంది. మెటల్, రియాల్టీ స్టాకుల్లో కొనుగోళ్లు ఇందుకు కారణమయ్యాయి. అయితే.. బీఎస్ఈ స్టాకుల్లో విలువైన రిలయన్స్ కంపెనీ షేర్లలో విక్రయాలు ఊపందుకున్నాయి.
దీంతో 209 పాయింట్లకు పైగా స్టాక్ మార్కెట్ గరిష్ఠ స్థాయి నుంచి తిరుగుముఖం పట్టింది. 16,075 వద్దకు కనిష్ఠంగా చేరుకుంది. అయితే మధ్యాహ్నపు ట్రేడ్‌ల సమయానికి స్టాక్ మార్కెట్ తిరిగి రికవరీ కాగలిగింది. జేపీ అసోసియేట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, డీఎల్ఎఫ్, ఐటీసీ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉండగా.. టాటా పవర్, ఎఫ్ఎంసీజీ స్టాకులైన హిందుస్థాన్ యునిలివర్, ఐటీసీ తదితర సంస్థలు నష్టాల్లో ఉన్నాయి.