దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు పయనిస్తోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏడు పాయింట్ల స్వల్ప నష్టంతో 17,043 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 3 పాయింట్లు స్వల్పంగా పతనమై, 5,058 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాలను నమోదు చేసుకున్న సెన్సెక్స్.. కొద్ది సేపట్లో తిరిగి స్వల్పలాభాల్లో ర్యాలీని పయనింపజేసింది. కానీ మదుపుదారులు అమ్మకాలవైపు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ సూచీ మళ్లీ నష్టాలను నమోదు చేసుకుంది.
ఇకపోతే.. ఐటీ, పార్మా, ఆటో మరియు రియాల్టీ వాటాల ట్రేడింగ్ పుంజుకుంది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.