విదేశీ మార్కెట్ల ప్రభావం: నష్టాలతో సెన్సెక్స్ ప్రారంభం
వారాంతమైన శుక్రవారం కూడా బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతోనే ప్రారంభమైంది. బుధవారం నుంచి నష్టాలతో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో 118 పాయింట్లు క్షీణించి, 16,667 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 42 పాయింట్ల పతనమై 4,946 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
ఆసియా, అమెరికా, యూరోపా మార్కెట్లు గురువారం నష్టాలను నమోదు చేసుకోవడం, దేశీయ మదుపుదారులు అమ్మకాలవైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు పయనిస్తుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇకపోతే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, రిలయన్స్ ఇన్ఫ్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, స్టెర్లిట్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
ఇదిలా ఉంటే హాంగ్ కాంగ్‌కు చెందిన హాంగ్ షెంగ్ ఇండెక్స్, జపాన్ నికాయ్, యూరప్ సూచీలు కూడా వారాంతమైన శుక్రవారం నష్టాలన నమోదు చేసుకుంటున్నాయి.