వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మధ్యాహ్నం వరకు నష్టాలను నమోదు చేసుకుని నత్తనడకన కొనసాగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ ర్యాలీ ఏకంగా పుంజుకుని భారీ లాభాలను ఆర్జించింది.
దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 236 పాయింట్లు భారీగా బలపడి, 17,021 పాయింట్ల వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 63 పాయింట్లు లాభపడి, 5,052 పాయింట్ల మార్కును తాకింది.
ట్రేడింగ్ ముగిసేందుకు రెండు గంటలున్న సమయంలో మదుపుదారులు కొనుగోళ్లపై మొగ్గుచూపడం, యూరప్ మార్కెట్ లాభాల వైపు పయనించడంతో బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకుంది. దీంతో ఏకంగా 200 పాయింట్లకు పైగా పెరిగి ట్రేడింగ్‌ను ఆశాజనకంగా కొనసాగించింది.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం పన్నుల నిబంధనలను పాటించకపోవడం వల్ల సెన్సెక్స్ ఒడిదుడుకులకు లోనైందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా చెప్పారు.
ఇకపోతే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు భారీగా లాభపడగా, బ్యాకింగ్, రిఫైనరీ, మెటల్ వాటాలు కూడా లాభాలను ఆర్జించాయి.