దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు ర్యాలీని ఆరంభించిన సెన్సెక్స్, వారాంతమైన శుక్రవారం 124 పాయింట్లు క్షీణించింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 17,868 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు పతనమై 5,367 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోవడం, దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. అలాగే ఐటీ, టెక్నాలజీ, ఆయిల్, గ్యాస్, రియాల్టీ, బ్యాంకింగ్ వాటాల ట్రేడింగ్ నత్తనడకన కొనసాగడం ద్వారా సెన్సెక్స్, నిఫ్టీలు తిరోగమనం వైపు ర్యాలీని ముగించాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. డీఎల్ఎఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, స్టెర్లిట్, హిందూస్థాన్ యునిలివర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టర్బో, విప్రో, ఏసీసీ, టీసీఎస్ వంటి కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. అయితే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు లాభాలను ఆర్జించాయి.