ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు చమురు అమ్మకాలలో చవిచూస్తున్న నష్టాలను పూడ్చేందుకు చమురు బాండ్లు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 23,457 కోట్ల విలువ గల చమురు బాండ్లను జారీ చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి మురళీ దేవ్‌రా గురువారం మీడియాతో అన్నారు.
మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ... ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచడంలేదని తెలిపారు. ధరలు పెంచకపోవడం వలన ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇండియాన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు చవిచూసిన నష్టాలను కొంత మేరకు పూడ్చేందుకుగాను రూ. 23,457 కోట్ల విలువ గల చమురు బాండ్లను జారీ చేయాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది.
మొత్తం నష్టం విలువ రూ. 54,935 కోట్లు కాగా అందులో 42.7 శాతాన్ని బాండ్లను జారీ చేయడం ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుందని మంత్రి వెల్లడించారు.
|