దేశంలో రెండో పెద్ద ఫార్మాస్యూటికల్స్ సంస్థగా పేరుగాంచిన రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇటలీకి చెందిన జెట్ జనరసీ ఎస్ఆర్ఎల్ సంస్థను కొనుగోలు చేసినట్లు గురువారం ప్రకటించింది. ఒకే వారంలో వరుసగా మరోసారి యూరప్‌కి చెందిన సంస్థను కొనుగోలు చేయడాన్నిబట్టి చూస్తే డాక్టర్ రెడ్డీస్ సంస్థ యూరప్‌లోని సంస్థలను కొనుగోలు చేయడంపై తన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందుగానే ఏప్రిల్ ఒకటో తేదీన బ్రిటన్‌కి చెందిన స్మాల్ మాలిక్యూల్స్ వ్యాపార సంస్థను కొనుగోలు చేసిన విషయం విదితమే.
ఈ విధంగా రెడ్డీస్ సంస్థ యూరప్ సంస్థల కొనుగోలు వేటలో నిమగ్నమవడాన్ని చూస్తుంటే ఆసంస్థ వ్యూహాత్మక ప్రణాళిక ప్రస్ఫుటంగా కనబడుతోంది. అంతేకాకుండా యూఎస్‌పై ఆధారపడకుండా స్వతంత్రంగా కార్యకలాపాలను కొనసాగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
యూరప్‌లోకల్లా మూడో అతి పెద్దదైన జెట్ జనరిసీ సంస్థను చేపట్టడం యూరప్ వ్యాపారరంగంలో తమ అభివృద్దికి తొలి మెట్టుగా భావిస్తున్నామని రెడ్డీస్ యూరప్ కార్యకలాపాల ప్రెసిడెంట్ వి.ఎస్.వాసుదేవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఫలితంగా ఈ ఇటలీ సంస్థకు చెందిన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో, రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్, సేల్స్, మార్కెటింగ్‌లు తమ ఆధీనంలోకి వస్తాయని రెడ్డీస్ సంస్థ పేర్కొన్నది.
|