ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణం.. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలను అష్ట కష్టాలకు గురి చేస్తోంది. ప్రతిపక్షాలకు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రధాన ఆయుధం. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం వరుసగా 42వ వారంలో కూడా పెరిగింది. గత నెల 26వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి చూడగా ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటు 7.61 శాతానికి చేరుకుంది. కిందటి వారం ఈ రేటు 7.57 శాతంగా ఉండేది. దీంతో ధరలు మరింత పెరగనున్నాయి.
గత ఏడాది ఇదే వారంతో పోల్చగా వార్షిక ద్రోవ్యోల్బణ రేటు 6.01 శాతంగా ఉండేది. ద్రవ్యోల్బణం పెరుగుదలతో కేంద్రం ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చినట్టయింది. ఈ ఏడాది జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ద్రవ్యోల్బణం కీలకాంశంకానుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర సరకుల ధరలకు రెక్కలు వచ్చాయి.
వీటిని అదుపు చేసేందుకు కేంద్రం ఎన్నో రకాల చర్యలు చేపట్టినా ప్రయోజనం కనిపించడం లేదు. స్టీలు కంపెనీలు కూడా ధరలను తగ్గించాయి. టన్నుకు రూ.4000 చొప్పున ఈ కంపెనీలు ధరలను తగ్గించాయి. కాగా, అన్ని నిత్యావసర సరుకుల ధరలు హోల్‌సేల్ మార్కెట్‌లో 227.5 నుంచి 227.7కు అంటే 0.2 శాతం మేరకు పెరిగాయి. అలాగే ప్రైమరీ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు కూడా గత వారం కంటే ఈ వారం 0.3 శాతం మేరకు పెరిగాయి.
గత వారం 237.9 శాతం ఉన్న వీటి ధరలు ప్రస్తుతం 238.6 శాతానికి చేరుకున్నాయి. టీ ధర 11 శాతం, చిరు ధాన్యాల మూడు శాతం, చేపల ఉత్పత్తులు రెండు శాతం, పండ్లు, కూరగాయల ధరలు ఒక శాతం మేరకు పెరిగాయి. ఇంధనం, పవర్, లైట్, ఇతర లూబ్రికెంట్ల ధరలు మాత్రం గత వారంతో పోల్చితే స్థిరంగానే ఉన్నాయి.
|