ధరలకు సంబంధించిన అంశంలో సోమవారం మధ్యాహ్నం తర్వాత దేశీయ ఉక్కు ఉత్పత్తి సంస్థలతో... ఉక్కు మంత్రిత్వ శాఖ సమావేశమయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ధరలను పెంచరాదని ప్రభుత్వం.. ఉక్కు ఉత్పత్తి కంపెనీలను కోరిన విషయం తెలిసిందే.
దీంతో పాటు ఉక్కు ఉత్పత్తి కంపెనీలు... అవకాశముంటే ధరలను తగ్గించాల్సిందిగా ప్రభుత్వం ఈ రోజు జరుగనున్న సమావేశంలో విజ్ఞప్తి చేయవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందు కోసం ధరలను పెంచరాదని ప్రభుత్వం తమను కోరినప్పటికీ... ఉక్కు మరియు బొగ్గుల ముడి పరికరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో తమ లాభాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని ప్రముఖ ఉక్కు ఉత్పత్తి సంస్థలైన టాటా స్టీల్ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ కంపెనీలు తెలిపాయి.
ఈ ఆగస్టులో భారత వార్షిక ద్రవ్యోల్బణం 12 శాతం కన్నా మించిపోవడంతో ఉక్కు ఉత్పత్తి కంపెనీలు, ధరలను పెంచరాదని.. కేంద్రం కోరిన విషయం విదితమే. ఇక సోమవారం జరుగనున్న సమావేశంలో దేశంలో తక్కువ ధరలకే ఉక్కును సరఫరా చేయాలని ప్రభుత్వం కోరిన పక్షంలో ఎగుమతి పన్ను 15 నుంచి 35 శాతానికి పెంచాల్సిందిగా ఉక్కు ఉత్పత్తి కంపెనీలు డిమాండ్ చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత నెలలో ముడి ఇనుము ఉత్పత్తిదార్లతో.. ఉక్కు ఉత్పత్తి కంపెనీలు... రెండు సార్లు సమావేశమయ్యాయి. ధరల పెంపు మరియు సరఫరా తదితర అంశాలపై కీలకంగా జరిగిన ఈ సమావేశాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యి చర్చలు జరిపారు.
|