దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ పీఠం మళ్లీ మన తెలుగు తేజానికే దక్కింది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న యాగా వేణుగోపాల్ రెడ్డి ఈనెల ఐదో తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తెలుగు బిడ్డ దువ్వూరి సుబ్బారావు నియమితులయ్యారు.
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి అయిన డాక్టర్ దువ్వూరి సుబ్బారావును వైవిరెడ్డి వారసునిగా ఎంపిక చేశారు. వైవీరెడ్డి బాధ్యతల నుంచి తప్పుకునే రోజునే డాక్టర్ దువ్వూరి పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారనే ఊహాగానాలకు కేంద్రం తెరదించుతూ దువ్వూరి నియామకాన్ని ఆర్థిక మంత్రి పి.చిదంబరం సోమవారం అధికారికంగా ప్రకటించారు.
ఐదో తేదీన బాధ్యతలు స్వీకరించే దువ్వూరి సుబ్బారావు మూడేళ్ల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉంటారని చిదంబరం వెల్లడించారు. పరిస్థితిని బట్టి ఆ తర్వాత మళ్లీ రెండేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలావుండగా డాక్టర్ వేణుగోపాల రెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త గవర్నర్ నియామకంపై అటు బ్యాంకింగ్, ఇటు ఆర్థిక సర్వీసుల వర్గాల్లో తారా స్థాయిలో చర్చ జరిగింది.
గవర్నర్ పదవికి దువ్వూరితో పాటు ప్రస్తుతం ఆర్‌బీఐ డిప్యూటి గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న రాకేష్ మోహన్ పేరుతో పాటు మరికొందరి పేర్లను కూడా పరిశీలించారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖలో మెరుగైన పనితీరును చూపించిన దువ్వూరి వైపే విత్తమంత్రి చిదంబరం మొగ్గుచూపారు.
|