దేశ ప్రజలపై మోపిన పెట్రోల్, డీజల్ ధరల పెంపు భారాన్ని ఇప్పట్లో తగ్గించే అవకాశాలు లేవని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీదేవ్‌రా స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. స్వదేశీయంగా పెంచిన ధరలను తగ్గించబోమని ఆయన తేల్చి చెప్పారు.
అదే సమయంలో ముడి చమురు బ్యారెల్ ధర ఒక్కింటికి వంద డాలర్ల లోపు తగ్గిన పక్షంలో ధరల తగ్గింపును పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) కంపెనీలు రోజుకు 400 కోట్ల రూపాయల మేరకు నష్టపోతున్నాయని ఆయన గుర్తు చేశారు.
అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ధరలను తగ్గించే ఆలోచన లేదని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ విఫణిలో ఒక బ్యారెల్ ధర 140 నుంచి 108 డాలర్లకు తగ్గిన విషయం తెల్సిందే. ఆయిల్ కంపెనీలు ముడి చమురు ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నిర్ణయించడంతో ధరలు తగ్గాయి. అందువల్ల స్వదేశీయంగా కూడా ధరలను తగ్గించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.
|