రానున్న ఐదేళ్లలో 300 నుంచి 500 వరకు డిజిటల్ రీటైల్ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు దేశీయ వినియోగదారుల వస్తు ఉత్పత్తి దిగ్గజం సలోరా గ్రూప్ కంపెనీ ప్రకటించింది. ఈ ఔట్‌లెట్‌లు ప్రారంభించడం ద్వారా 5వేల ఉద్యోగాలను దేశవ్యాప్తంగా కల్పించవచ్చని సలోరా కంపెనీ అంచనా వేస్తోంది.
దేశంలో తమ ఉనికిని చాటేందుకు కంపెనీని విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు సలోరా కంపెనీ రీటైల్ వెంచర్స్ సీఈఓ సంజీవి సేథి తెలిపారు. మల్టీ-బ్రాండ్ డిజిటల్ రీటైల్ రంగంలోకి అడుగిడుతున్నట్లు 250 మిలియన్ అమెరికా డాలర్‌ల సలోరా గ్రూప్ కంపెనీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విభాగం కోసం... అంటే రీటైల్ విభాగం కోసం సుమారు రూ. 200 కోట్లకు పైగా వెచ్చించినట్లు తెలిసింది.
ఈ నిధులను గ్రూపు రీటైల్ విభాగమైన సలోరా రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ నుంచి సేకరించింది. దేశంలో ఎవరైతే రీటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నారో... ఆయా కాలేజీలతో తాము ఒప్పందం చేసుకుంటామని... అలాగే అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తామని సలోరా గ్రూప్ ఉపాధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ జీవరాజ్‌కా తెలిపారు.
విద్యార్ధులు ఈ కోర్సుల్లో చేరిన అనంతరం వారికి ఉద్యోగాన్ని కల్పించే హామీ కూడా ఇవ్వనున్నట్లు వ్యాఖ్యానించారు. తమకు యూనివర్శిటీ టాపర్లు అవసరం లేదని... ఎవరైతే ఈ రంగం పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారో వారందరినీ కూడా సలోరా గ్రూప్ ఆహ్వానిస్తున్నట్లు గోపాల్ తెలిపారు.
అలాగే... ఫ్రెషర్ అయి ఉండి టాలెంట్ ఉన్నవారికి తగినంత శిక్షణను కూడా ఇప్పిస్తామన్నారు. కాగా, సలోరా గ్రూప్ ఇప్పటికే దేశ రాజధానిలో 'టెర్నినల్' పేరిట తొమ్మిది స్టోర్‌లను కలిగి ఉంది. అలాగే దేశవ్యాప్తంగా 35 స్టోర్‌లను కలిగి ఉంది.
|