సంక్షోభం నీడలో చిక్కుకున్న దేశ ప్రజలకు ప్రధాని మన్మోహన్ ఆశావహ సందేశాన్ని అందిస్తూ, ప్రస్తుత సంక్షోభ కాలంలోనూ భారత్ 8 శాతం వృద్ధి రేటును కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. వృద్ధి రేటు దెబ్బతినని విధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని కోరారు.న్యూఢిల్లీలో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో ప్రధాని ప్రసంగిస్తూ భారత్ తన వృద్ధి రేటును నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ భారత్ పాత్ర పోషించాలని మన్మోహన్ చెప్పారు.ఈ సందర్భంగా ప్రజలకు ఆత్మవిశ్వాసపూర్వకమైన ఆశావహ సందేశాన్ని ఇస్తున్నట్లుగా ప్రధాని చెప్పారు. దేశీయ వృద్ధి రేటును మనం నిలబెట్టుకుంటామని, ఇదే వేగంతో, గౌరవంతో మనం ముందుకు పోతామని జాతికి హామీ ఇచ్చారు. ఈ ఏటి బడ్జెట్టు కొన్నింటిలో ప్రపంచ మందగమనానికి వ్యతిరేకంగా చర్యలను ప్రతిఫలించిందని చెప్పారు. వ్యవసాయదారులకు, ప్రభుత్వోద్యోగులకు మినహాయింపులను ఇచ్చామని, మౌలిక వసతుల రంగాన్ని భారీగా విస్తరించామని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక పతనం బలహీనవర్గాలపై భారం మోపకుండా, సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో అభివృద్ధి చెందుతున్న దేశాల సామర్థ్యాన్ని అడ్డుకోకుండా చర్యలు చేపట్టాలని ప్రధాని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.ఆర్థిక వ్యవస్థను, పాలనా వ్యవస్థను పునఃపరిశీలించాల్సి ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చట్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయవలసిన అవసరముందని ప్రధాని సూచించారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ నేతలు కలిసికట్టుగా సమావేశమైనందుకు ప్రధాని అభినందిస్తూ, 2009 మార్చిలో కూడా మరోసారి సమావేశం కానున్నామని చెప్పారు. సంక్షోభ పరిష్కారానికి ఇది ఆశావహమైన ప్రారంభమని చెప్పారు. |