వ్యూహాత్మక దేశంగా గుర్తింపు పొందిన టర్కీ యూరప్, ఆసియా ఖండాల వారధిగా తన్ను తాను నిరూపించుకుందని భారత శాస్త్ర, సాంకేతిక మంత్రి కపిల్ సిబాల్ ప్రశంసించారు. టర్కీ ప్రధాన మంత్రి రెసెప్ టయిప్ ఎర్డోగాన్ సమక్షంలో జరిగిన ఫిక్కీ వాణిజ్య సమావేశంలో కపిలి సిబాల్ ప్రసంగించారు. న్యూఢిల్లీలో భారత వాణిజ్య మండలి, అసోచామ్ సంయుక్త సమావేశంలో పాల్గొన్న కపిల్ సిబాల్ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునే కీలక ప్రాంతలో టర్కీ నెలకొని ఉండటం ఆ దేశానికి వరంలాంటిదని పేర్కొన్నారు. యూరప్, ఆసియా ఖండాలు అందించే ఉత్తమ అవకాశాలను టర్కీ అందిపుచ్చుకోగలదని అభిప్రాయపడ్డారు. యూరప్, ఆసియా ఖండాలు రెండింటివైపు తొంగిచూసే దేశంగా, ఈ రెండు ఖండాల మధ్య వారధి దేశంగా, యూరప్, ఆసియాలలో లభ్యమయ్యే నైపుణ్యతలను, అవకాశాలను అందిపుచ్చుకునే దేశంగా టర్కీ కీలక ప్రాంతంలో ఉందని కపిల్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రాదేశికంగా, రాజకీయంగా, అధికారికంగా రెండు ఖండాలలోనూ టర్కీ భాగమై ఉందని తద్వారా అది అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటోందని కపిల్ పేర్కొన్నారు. భారత్, టర్కీ దేశాలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో సహకరించుకోగలవని సిబాల్ తెలిపారు. జాయింట్ వెంచర్లు నెలకొల్పుకోవడం ద్వారా తాము పరస్పరం సహకరించుకోవచ్చునని సూచించారు. టెక్నాలజీ రంగంలో, వస్తూత్పత్తి రంగంలో, గుడ్లపెంపకంలో తమ రెండు దేశాలు సహకరించుకోవచ్చని పేర్కొన్నారు. |