ఆర్థిక సంక్షోభం అమెరికా బ్యాంకులను అతలాకుతలం చేస్తోంది. సంక్షోభం దెబ్బతో ఇప్పటికే అమెరికాలో ఈ ఏడాది 22 బ్యాంకులు మూతబడ్డాయి. కాగా మరికొన్ని బ్యాంకులు దివాళా దిశలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా పేరొందిన సిటీ గ్రూప్ బ్యాంక్ సైతం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లు సమాచారం.
యూఎస్‌లో పేరుగాంచిన మూడు బ్యాంకులు గత శుక్రవారం మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం సృష్టించిన పెను అలజడిలో కొట్టుకుపోయిన బ్యాంకుల్లో క్యాలిఫోర్నియా పిపిఎఫ్ బ్యాంక్ దేశంలో మూతపడ్డ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకు కావడం గమనార్హం.
బ్యాంకులను పట్టుకు పీడిస్తున్న ఈ పెను సంక్షోభం వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చని అమెరికా ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలను జారీ చేయడం వల్లనే బ్యాంకులు దివాళా దిశలో పయనిస్తున్నాయని బ్యాంకింగ్‌రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.
మరోవైపు మదుపుదారులు వరుసగా తమ డిపాజిట్లను తీసుకుంటూ ఉండటంతోనూ పరిస్థితి మరింత దిగజారుతోంది. మొత్తంమీద చూస్తే క్యాలిఫోర్నియా నగరంలోనే అత్యధికంగా బ్యాంకులు దివాళా తీస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2003 నుంచి 2007 వరకూ అమెరికాలో మూతబడ్డ బ్యాంకుల సంఖ్య కేవలం పది. కాగా ఈ ఏడాది ఏకంగా 22 బ్యాంకులు మూతపడ్డాయి. మరికొన్ని దివాళా దిశలో పయనిస్తున్నాయి. |