ఆర్థిక సంక్షోభం.... ప్రపంచంలోని పలు వాణిజ్య సంస్థలను గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో బ్యాంకులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. సంక్షోభం ప్రభావంతో నష్టాలలో కూరుకుపోయిన సిటీ బ్యాంకుకు అమెరికా ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉండేందుకు ముందుకొచ్చింది.
మూతబడే స్థితిని తప్పించేందుకుగానూ సిటీ బ్యాంకుకు 306 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు రుణ భారంలో కొంత భారాన్ని భరించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.
ప్రపంచవ్యాప్తంగా పలు శాఖలను కలిగివున్న సిటీ బ్యాంకు మూతపడితే ఆ ప్రభావం ప్రపంచ స్థాయిలో ఉంటుందన్న ఆందోళనతో అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది.
దాదాపు వంద దేశాల్లో సిటీ బ్యాంకు శాఖలున్నాయి. ఈ నేపథ్యంలో... ఆ బ్యాంక్‌ను ఆదుకునే దిశగా అమెరికా ప్రభుత్వం ఆదివారం రాత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా... ఆర్థిక సంక్షోభం ప్రపంచ దేశాలను అట్టుడికింపజేస్తుంది. గత రెండు వారాలుగా ఆసియా మార్కెట్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |