ఆర్థికాభివృద్ధిలో భారతదేశ గమనం ఆశాజనంగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పి. చిదంబరం సోమవారం న్యూఢిల్లీలో తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ధాటికి పలు దేశాల ఆర్థిక పరిస్థితి కుప్పగూలి పోయిందనీ, అయితే ఈ సంక్షోభ ప్రభావం నుంచి భారత్ ఇప్పుడిప్పుడే తేరుకుని వృద్ధి చెందుతోందని ఆయన వివరించారు.ఇతర దేశాల కంటే.. భారత ఆర్థిక రంగ వృద్ధి రేటు చాలా మెరుగ్గా ఉందని చిదంబరం పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో పలు దేశాలు అప్పుల్లో కూరుకుపోయాయని, అయితే అలాంటి పరిస్థితి భారత్‌కు లేదని... మాంద్యానికి తాము చాలా దూరంలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.అంతేగాకుండా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు మందగమనంతో సాగుతోంది కాబట్టి, ప్రజలు తాత్కాలిక ఎదురుగాలికి సంసిద్ధులవ్వాలని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రజలకు సూచనప్రాయంగా తెలిపారు. ఆర్థికాంశాల్లో లిక్విడిటీ సమస్య గురించి అంగీకరించిన ఆయన.. ఆర్‌బీఐ తగినంతగా, మార్కెట్ లిక్విడిటీ డిమాండ్లకు అనుగుణంగా తగినంత డబ్బును ఉపయోగించని కారణంగా ఈ సమస్య తలెత్తుతోందని, దీంతో మార్కెట్లు బలహీనపడుతున్నాయని ఆయన వెల్లడించారు. |