భారత్ ఆర్థిక మాంద్యానికి చేరువగా లేదని ఆర్థిక మంత్రి పి. చిదంబరం వక్కాణించారు. మాంద్యం చేరువలో లేకపోగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఆరోగ్యకరమైన ఆర్థికాభివృద్ధిని నమోదు చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా నిలబడిందని సూచించిన మంత్రి ఇంతవరకు దేశ ప్రజలు ధరల విషయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, త్వరలో ఈ పరిస్థితి మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మాంద్య పరిస్థితులలోకి వెళుతోందన్న భయాందోళనలను ముందుగా మన మనసులలోంచి చెరిపివేసుకోవాలని చిదంబంరం సూచించారు. ప్రపంచ ఆర్థిక మందగమనపు తాత్కాలిక ప్రభావానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సంవత్సరం సైతం ఆర్థికాభివృద్ధి 7.9 శాతంవరకు ఉండగలదని మంత్రి తెలిపారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ తాకిడికి విదేశీ మారక ద్రవ్య నిల్వ, విదేశీ పెట్టుబడి గురయ్యాయని, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యత ఏర్పడిందని మంత్రి అంగీకరించారు. ద్రవ్యలభ్యత డిమాండ్లను నెరవేర్చేందుకోసం రిజర్వ్ బ్యాంక్ మార్కెట్లోకి నగదు విడుదల చేసిందని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే విదేశీ సంక్షోభ ప్రకంపనలకు భారత్ ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడిందని, ద్రవ్యోల్బణం పెరుగుదలకు సంబంధించిన చెడు గడియలు కూడా ముగిశాయని చిదంబరం చెప్పారు. వడ్డీరేట్లను, రెపో రేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న చర్యలు ద్రవ్యోల్బణాన్ని అడ్డుకుంటున్నాయని తెలిపారు. దీని ఫలితంగా ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్‌కు తగ్గిపోయిందని మంత్రి గుర్తు చేశారు.యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడేళ్ల పాటు మనం 9 శాతం వృద్ధిని చవిచూశామని, ఇంతకు ముందెన్నడూ ఇంత క్రమ అభివృద్ధిని మనం చూడలేదని చిదంబరం చెప్పారు. ప్రజల ఆదాయం, పొదుపులు, ఎగుమతులు కూడా బాగా పెరిగాయని మంత్రి సూచించారు. |