దేశంలో అన్నీ అనూకూలిస్తే.. వచ్చే నెలలో పెట్రో ధరలను తగ్గిస్తామని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీదేవ్‌రా తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆరు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున పెట్రో ధరల తగ్గించలేమని ఆయన స్పష్టం చేశారు.
దీనిపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల వల్ల ఇంధన ధరలను తగ్గించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అందువల్ల వచ్చే నెల 24వ తేదీ తర్వాత తగ్గిస్తామని ఆయన అన్నారు. ఇదిలావుండగా గత జులైలో బ్యారెల్ ముడి చమురు ధర 147 డాలర్లకు చేరుకోవడంతో పెట్రోల్‌పై భారీగా వడ్డన విధించారు.
ఈ బ్యారెల్ ధర 54 డాలర్లకు తగ్గినప్పటికీ.. పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించలేదు. ముడి చమురు ధర తగ్గిందని, ఇంధన ధరలను తగ్గించాల్సి ఉందని, అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తగ్గించలేకపోతున్నామని మురళీ దేవ్‌రా వివరణ ఇచ్చారు.
తమ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 24వ తేదీలోగా ఇంధన ధరల తగ్గింపుపై, సబ్సిడీలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చమురు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.ఎస్.పాండే చెప్పారు. జూన్‌లో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పది శాతం పెంచిన విషయం తెల్సిందే. |