రాజకీయ నేతలు తమ వేతనంలో కోత విధించుకోవడం మనం చాలా అరుదుగానే వింటూ ఉంటాం. ఆర్థిక మాంద్యం తాకిడి ప్రస్తుతం సింగపూర్ రాజకీయ నేతలను కూడా తాకినట్లుంది. ప్రపంచంలోనే అత్యంత అధికంగా వేతనాలు తీసుకునే సింగపూర్ రాజకీయ నేతల వేతనాలపై వచ్చే సంవత్సరంలో 19 శాతం వరకు కోత విధించనున్నారు.ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడి కంటే అధికంగా ఆర్జిస్తున్న సింగపూర్ ప్రధాని లీ సైనే లూంగ్ తన వేతనంలో కోత విధించుకోవడం ద్వారా ఆదర్శం నెలకొల్పారు. సింగపూర్ ప్రధాని వార్షిక వేతనం 12 కోట్ల 30 లక్షల 79 వేల 932 రూపాయలు. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తీసుకుంటున్న ఆదాయం కంటే ఇది అయిదు రెట్లు ఎక్కువ. వచ్చే సంవత్సరం నుంచి తన వేతనంలో 19 శాతం మేరకు కోత విధించుకున్నట్లుగా సింగపూర్ ప్రధాని ప్రకటించారు. అంటే తన వేతనం 9,95,05,769 కోట్ల రూపాయలకు పడిపోతుంది. ఈ సంవత్సరం సింగపూర్ తన వృద్ధిరేటును నాలుగో సారి తగ్గించుకుంది. 2009లో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కానుందని అంచనాలు వేస్తున్న నేపథ్యంలో సింగపూర్ ప్రధాని స్వయంగా తనతోనే వేతనాల కోతను అమలు చేశారు. |