సుప్రసిద్ధ భారతీయ, విదేశీ సంస్థలు తమ వ్యాపార సమావేశాలను నిర్వహించుకునే ముంబై ఫైవ్ స్టార్ హోటళ్లలో బుధవారం రాత్రి ఉగ్రవాదులు జొరబడిన సమయంలో దేశ విదేశీ వాణిజ్య ప్రముఖులు సమావేశాలు జరుకుంటున్నట్లు తెలిసింది. హిందూస్తాన్ యూనీలీవర్, ఇస్పాట్ ఇండస్ట్రీస్ వంటి కార్పొరేట్ సంస్థల ఉన్నతాధికారులు బుధవారం రాత్రి తాజ్ హోటల్‌లో ఉన్నట్లు సమాచారం.
హిందూస్తాన్ యూనీలీవర్ అగ్రశ్రేణి మేనేజింగ్ టీమ్ మొత్తంగా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. చివరకు కంపెనీ ఛైర్మన్ హరీష్ మన్వానీ, డైరెక్టర్ నితిన్ పరాంజపే, ఎగ్జిక్యూటివ్ లీగల్ డైరెక్టర్ అశోక్ గుప్తా, హ్యూమన్ రిసోర్సెస్ డైరెక్టర్ లీనా నయ్యర్ తాజ్ మహల్ ప్యాలెస్ పైని టవర్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదులు ప్రవేశించినప్పుడు వారు అక్కడ భోజన సమావేశంలో ఉన్నారు.
ఉక్కు కంపెనీ అయిన ఇస్పాట్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వినోద్ గార్గ్, ఆయన సతీమణి, మరో 70 మందిదాకా ప్రముఖులు ఓబెరాయ్ హోటల్‌లో చిక్కుబడిపోయారు. స్పెయిన్ నుంచి వచ్చిన ఫారిన్ కస్టమర్లతో బిజినెస్ డిన్నర్ కోసం గార్గ్ దంపతులు ఆసమయంలో హోటల్‌కి వచ్చి ఉన్నారు.
అయితే ఈ ప్రముఖులు హోటల్‌లో ఉన్నారా లేదా ఉగ్రవాదుల బందీలుగా మారిపోయారా అనే విషయాన్ని తాజ్, ఓబెరాయ్ హోటల్ నిర్వహణాధికారులు తేల్చి చెప్పడం లేదు. తమ కస్టమర్ల భద్రతకోసం పోలీసుల సాయాన్ని పొందడానికి తాము ప్రయత్నిస్తూన్నామని తాజ్ హోటల్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పడం గమనార్హం. |