బుధవారం నుంచి గత 60 గంటలుగా ముంబైలో కొనసాగిన ఉగ్రవాద దాడి కారణంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైకి దాదాపుగా 4,000 కోట్ల రూపాయల నష్టం సంభవించిందని పారిశ్రామిక నిపుణులు పేర్కొన్నారు. హోటల్, షాపులు, ఇంకా మూతపడిన వ్యాపారాలు ఇలా అన్నిటిని కలుపుకుని చూస్తే ఇంత భారీ మొత్తం నష్టాన్ని నగరం చవి చూసిందని వీరు పేర్కొంటున్నారు. కోటమందికి పైగా జనం ఉన్న మహానగరంలో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోతే రోజుకు కనీసం వెయ్యికోట్ల రూపాయల నష్టం వాటిల్లక తప్పదని అసోచామ్ కార్యదర్శి డిఎస్ రావత్ తెలిపారు. ఉగ్రవాదుల ముట్టడిలో నగరం నాలుగు రోజుల పాటు చిక్కుకుపోయిన కారణంగా కనీసం నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని చెప్పారు. దాడికారణంగా గురువారం బాంబే స్టాక్ ఎక్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్చేంజ్, కమోడిటీ ఎక్చేంజ్ మూతపడగా, ఎన్నో కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగులు లేక వెలవెలపోయాయని వార్తలు. బిఎస్ఇ, ఎన్ఎస్ఇ, కమోడిటీ ఎక్చేంజ్ మూడింటి ఆదాయం రోజుకు రూ32,710 కోట్ల మేరకు ఉంటుంది. దేశంలో వినోద పరిశ్రమకు కూడా తలమానికంగా ఉండే ముంబై నగరంలో ఉగ్రవాద దాడి కారణంగా టెలివిజన్, చిత్ర పరిశ్రమ కూడా భారీగా నష్టపోయిందని ఓ చిత్ర నిర్మాత తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో తాము పది కోట్ల రూపాయలను నష్టపోయామని, ధియేటర్లు మూసి ఉంచిన కారణంగా పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. |